#అమాయకపుబ్రాహ్మణుడుమరియుదొంగలుతెలుగుకథ #Telugukathalu #Panchatantrastories
************ అమాయకపు బ్రాహ్మణుడు మరియు దొంగలు తెలుగు కథ ****************
అనగనగా ఒక ఊరిలో ఓ బ్రాహ్మడు వుండేవాడు. అతను చాలా అమాయకుడు. దాంతో అతన్ని అందరూ "పిచ్చి బ్రాహ్మడు...పిచ్చి బ్రాహ్మడు..." అంటూ ఆట పట్టిస్తూ వుండేవారు. వాళ్ళంతా తనను అలా ఏడిపిస్తుంటే పాపం ఆ బ్రాహ్మడికి చాలా బాధేసేది.
ఎలాగైనా సరే తను అమాయకుడు కాదు, చాలా తెలివైన వాడినని నిరూపించాలనుకున్నాడు. అందుకు పట్నానికి వెళ్ళి ఎవ్వరూ కొనలేనంత తక్కువ ధరకి ఏదైనా కొని తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరచాలనుకున్నాడు.
ఓరోజు పట్నానికి వెళ్ళి చాలా చౌకగా ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వస్తుంటే మార్గం మధ్యలో ముగ్గురు దొంగలు చూసారు.
" అరేయ్.. ఆ పిచ్చి బ్రాహ్మడు ఏదో తీసుకుని వస్తున్నాడ్రా.. " అని ఒక దొంగ అన్నాడు.
" ఏదో కాదురా, అది ఒక బుజ్జి మేక" అన్నాడు రెండోదొంగ.
" ఆ బ్రాహ్మడు చాలా అమాయకుడు.. పైగా అతను మనకు తెలుసుగానీ, మనం అతనికి తెలీదు.. ఆ మేకను కాజేయడం చాలా సులభం" అన్నాడు మూడోదొంగ.
ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్న ఆ ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలబడ్డారు.
మొదటి దొంగ బ్రాహ్మడు దగ్గిర పడుతుంటే చూసి ఎదురుగా వచ్చి, “అయ్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు.
కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయంగా నమస్కరించాడు. “అయ్యా, తమను చూస్తే చాలా పెద్దవారిలా వున్నారు.. మరి ఈ కుక్కను ఎందుకు మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు.
కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చాడు.
“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అని సహజ ధోరణిలో అనేసి ముందుకు సాగాడు ఆ దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…
తర్వాత ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు.
అందుకే పెద్దలు చెబుతారు .. “ అమాయకత్వం అందరికీ అలుసేననీ..”
0 Comments